ఆమనగల్లు, వెలుగు: సుభాశ్ పత్రీజీ కుటుంబ ఆశయ సాధన కోసం బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం హనుమాస్ పల్లి మహేశ్వర మహా పిరమిడ్ లో నిర్వహిస్తున్న పత్రీజీ ధ్యాన మహాయాగంలో ఆయన పాల్గొని ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రీజీ తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, ధ్యానం పేరుతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు.
పత్రీజీ తండ్రి షుగర్ ఫ్యాక్టరీలో పని చేస్తూ అనేక ఉత్పత్తుల తయారీకి కృషి చేశారని చెప్పారు. ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా కోట్లాది రూపాయలు వెచ్చించి పిరమిడ్ ను స్థాపించి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వారిని ధ్యాన మార్గంలో నడిపించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.